DPR: నార్త్, ఫోర్త్ సిటీ మెట్రోకు జోష్ 8 d ago

మెట్రో రెండో దశ 'బి' విభాగం కింద ప్రతిపాదించిన నార్త్ సిటీ, ఫోర్త్ సిటీ మెట్రో ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు(DPR) చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మూడు కారిడార్ ల అలైన్ మెంట్ లు, నిర్మాణ వ్యయంపై అంచనాలను సిద్ధం చేస్తున్నారు. మరో పది రోజుల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ (HMRL) సంస్థ తుది మెరుగులు దిద్ది ప్రభుత్వానికి నివేదికలు అందించనుంది. తొలి దశలో భావించినట్లుగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లకు అవకాశం ఉండకపోవచ్చన్నారు.
కాగా, JBS నుంచి మేడ్చల్ మార్గంలో డెయిరీ ఫాం వరకు HMDA చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద 600 మీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో డబుల్ డెక్కర్ పై ప్రతిష్టంభన నెలకొంది. మెట్రో కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ ORR వరకు ప్రతిపాదించిన రూట్ లో కూడా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ లపై సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణులు త్వరలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.
ఈ వేలో కూడా HMDA ఎలివేటెడ్ కారిడార్ ను ప్రతిపాదించింది. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాలో రక్షణశాఖ నుంచి భూముల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. రక్షణ శాఖ అధికారులతో HMDA అధికారులు తాజాగా సమీక్షా నిర్వహించారు. అటు ఫోర్త్ సిటీకి ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ లో కొన్ని కిలోమీటర్లు భూమార్గంలో మెట్రో పరుగులు తీయనుంది. కాగా, ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.
JBS నుంచి మేడ్చల్ వరకు 24 కి.మీ, JBS నుంచి శామీర్ పేట్ వరకు 21 కి.మీ, ఫ్యూచర్ సిటీ వరకు 41 కి.మీ. మెట్రో కారిడార్ల DPR ల కోసం HMRL దశలవారీగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. ఈ కారిడార్లలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ తోపాటు భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీపై ఇప్పటికే నివేదికలను సిద్ధం చేశారు. అలాగే జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మెట్రో రావడం వల్ల నార్త్ సిటీ వైపు వాహనకాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టనుందని అంచనా. భూసామర్థ్య పరీక్షల్లో భాగంగా మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటికే మెట్రో రెండో దశలో 5 కారిడార్ లలో 76.4 కి.మీ. తోపాటు.. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కి.మీ., శామీర్పేట్ ORR వరకు 22 కి.మీ, ఫ్యూచర్ సిటీ కారిడార్ 41 కి.మీ. చొప్పున మొత్తం 8 కారిడార్లలో 162.4 కి.మీ. వరకు మెట్రో కారిడార్ లు నిర్మించనున్నారు. మెట్రో మొదటి దశలోని 69 కి.మీ.తో కలిపితే హైదరాబాద్ లో మెట్రో సేవలు 231.4 కి.మీ.కు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మొదట విస్తరించనున్న 5 కారిడార్లలో 2028 కు సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు, నార్త్ సిటీ, ఫోర్త్ సిటీ కారిడార్ లతో కలిపి సుమారు 12 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా. 2030కు మెట్రో ప్రయాణికులు 15 లక్షలు దాటే అవకాశం ఉంది. అయితే, HMRL MD గా ఎన్విఎస్ రెడ్డిని త్వరలో తిరిగి నియమించనున్నట్లు సమాచారం.